.....

• చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమంలో కీలక పాత్ర

• అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఘన సన్మానం

పుంగనూరు, (రాధే సింధూరం) చిన్నారుల ఆరోగ్యం, పోషణతో పాటు గర్భిణులు, బాలింతల సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. పుంగనూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని ఉర్దూ స్కూల్‌ ఏరియా, కోనేటిపాళ్యం, సుబేదార్‌ స్ట్రీట్‌ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో స్థానిక నానాబాల వీధి సచివాలయంలో అంగన్వాడీ ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి పుంగనూరు ప్రాజెక్టు గ్రేడ్‌-1 సూపర్‌వైజర్‌ శ్రీమతి ఆయేషా నజ్రిన్‌ తాజ్‌ హాజరయ్యారు. విశ్రాంత డీఎస్పీ, టీడీపీ సీనియర్‌ నాయకుడు సుకుమార్‌ బాబు, బీజేపీ నాయకులు నానాబాల కుమార్‌, నరసింహులు, రామకృష్ణ, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, బాలల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలపై వివరించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన సూచనలు అందించడం, తల్లులకు ఆరోగ్యం–పోషణపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు.
అంగన్వాడీ కార్యకర్తలు సునంద, ప్రేమకుమారి, కామాక్షి, హెల్పర్లు రమణమ్మ, సుజాత, అలియా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అంగన్వాడీ కేంద్రాలు కేవలం చిన్నారుల సంరక్షణకే పరిమితం కాకుండా తల్లులు, పిల్లల ఆరోగ్యం, పోషణ, అవగాహన పెంపొందించడంలో ముఖ్యమైన వేదికలుగా పనిచేస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ప్రతిరోజూ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ స్థానిక బీజేపీ నాయకులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది సేవలను కొనియాడుతూ, చిన్నారులు మరియు మహిళల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది.