పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తాను ఒక పారిశుద్ధ్య కార్మికుడిని అనే విధంగా వారితో కలిసి పని చేసిన బాపట్ల ఎమ్మెల్యే
ఫ్లెక్సీ ల బదులు పచ్చని చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం... బాపట్ల ఎమ్మెల్యే
మనం ఆదర్శవంతంగా ఉంటూ ఇతరులను ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుదాం అంటున్న బాపట్ల ఎమ్మెల్యే
బాపట్ల (రాధే సింధూరం )పరిశుభ్రమైన బాపట్లే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలలో నూతనంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమం బాపట్ల పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవాలయం సమీపంలో స్థానిక శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను ఊడ్చి, మున్సిపాలిటీ ట్రాక్టర్‌లోకి ఎత్తారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పారిశుధ్య పనులు చేయడంతో స్థానికులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ల విస్తరణ, పారిశుధ్యం విషయంలో చట్టం ఎవరికైనా ఒక్కటేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా నిరూపించారు. ఫుట్‌పాత్‌లపై నడిచే కాలినడక ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫుట్‌పాత్ స్తంభాలకు కట్టిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దగ్గరుండి మరీ తొలగింపజేశారు. రోడ్డు మార్జిన్ దాటి, రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారులను వెనక్కి జరిపించారు. అలాగే, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపార పనిముట్లను రోడ్డుపైనే ఉంచిన షాపుల యజమానుల సామాగ్రిని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో మున్సిపల్ ఆఫీస్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపు:
"బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడం మన అందరి బాధ్యత. రోడ్లు, ఫుట్‌పాత్‌లు ప్రజలు నడవడానికే కానీ ఆక్రమించుకోవడానికి కాదు. వ్యాపారస్తులు రోడ్డు మార్జిన్ లోపలే తమ వ్యాపారాలు చేసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదు. ప్రతి ఒక్కరూ ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమానికి సహకరించి బాపట్లను స్వచ్ఛ పట్టణంగా మార్చాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.