కృత్రిమ ఇంధన కొరత సృష్టిస్తే ఉపేక్షించబోము
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల (రాధే సింధూరం )బాపట్ల జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, కేవలం రవాణా వ్యవస్థలో తలెత్తిన కొన్ని తాత్కాలిక కారణాల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు సంస్థల ప్రతినిధులతో మాట్లాడి, అన్ని బంకులకు నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టిందని ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, భయాందోళనతో పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ సేకరించి ఇళ్ల వద్ద నిల్వ ఉంచుకోవడం అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చునని హెచ్చరించారు. రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇంధన నిల్వలు మరియు సరఫరా పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు.జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద పోలీసు అధికారులు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని, రద్దీ ఎక్కువగా ఉన్న చోట ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించామన్నారు. ఎవరైనా ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేసినా, వదంతులు వ్యాప్తి చేసినా, లేదా ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.